Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

ప్రతివానికి సంస్కృతభాషా పరిచయము

సంస్కృతశ్లోకం ఎవరయినా చదువుతున్నాసరే, సంస్కృతంలో ఎవరయినా ఉపన్యాసమిస్తున్నాసరే మనమందరమూ అనువాదకుని సాహాయ్యంలేకుండా గ్రహించగల్గినంత సంస్కృత భాషాపరిజ్ఞానం కల్గి ఉండాలి. దాదాపు ఎనిమిదివందల సంవత్సరాలక్రితం ఒక భారతదేశంలోనేకాక, దూరప్రాచ్యదేశాలు: నయాం, కంబోడియా, జావా, బాలీదేశాలలోకూడా సంస్కృతం రాజభాషగా ఉండేది. ఈదేశాలలో ఇప్పటికీ, సంస్కృత భాషలోని పురాతన శిలాశాసనాలూ, తామ్రశాసనాలూ కనపడుతున్నవి. అంతేకాదు. మనదేశంలోనే దక్షిణాదిజిల్లాలలో కనపడే ద్రావిడ శిలాశాసనానలలోకూడా శాసనం 'స్వస్తిశ్రీ' అన్న సంస్కృతపదాలతో ప్రారంభం. కామకోటిమఠంనుండి జారీచేయబడే శ్రీముఖాలుసైతం 'స్వస్తిశ్రీ' అన్న పదాలతోనే ప్రారంభమవుతవి.

న్యాయస్థానాలలోకూడా వ్యవహారకాండ ధర్మశాస్త్రాలనే అనుగమించేది. బ్రిటీషువారు రాకపూర్వం, దక్షిణాదిని ముస్లిముల పరిపాలన కొద్దికాలమైనా, ఆ కాలములో కూడా వాదులు, ప్రతివాదులు హిందువులైతే, 'సాదర్‌ అమీన్‌' 'సాదర్‌ అదాలత్‌' అనబడే న్యాయస్థానాలలో పండితులసహాయాన్ని అభ్యర్థించి తీర్పు చెప్పేవారు. పార్టీలు ముస్లిములు అయితే కాజీలను పిలువనంపేవారు. మెయిన్స్‌ హిందూ లా (ఃశnn| ఐndష ంశూ) వ్రాయబడేసరికి ఈ పండితుల కందరికి నిరుద్యోగం ప్రాప్తించింది. కావేరీతీరంలోవుండే గ్రామస్థుల పూర్వవ్యవహారాలు తరచిచూస్తే, వారి విద్యావైదుష్యాలు, తిరువాన్కూరు మహారాజావారి ఆస్థానంలో ఏవిధంగా గౌరవాదరణలు పొందినవో వ్యక్తమవుతుంది. కొంతకొంత పుదుక్కోట ఆస్థానమూ ఈపండితులను ఆదరించింది. దక్షిణాత్య పండితులు పూనాలోని పీష్వాల సదస్సులోనూ తమతమ విద్వత్తునుచూపిపారితోషికాలనుపొందినట్లు తెలియవస్తున్నది.

రాజులకాలం, జమిందారులకాలం చెల్లిపోయింది. అది గతచరిత్ర. ప్రస్తుతమున్నది ప్రజాప్రభుత్వం. ఇందుప్రతిపౌరుడూ ఒక రాజే ఒకనివద్దనున్న రాచరికం తునియలు చేయబడి ప్రతిపౌరునికిన్నీ పంచబడినది. అందుచే సంస్కృతభాషలో ఉన్న విజ్ఞానసంపదా, ఐహికజ్ఞానమూ ఆముష్మికజ్ఞానమూ జారవిడుచుకోకుండా సంస్కృతభాషా పరిచయం వృద్ధిచేసుకోవడం మనకు ఎంతైనా అవసరం. అట్లాచేస్తే దీనిమేలు మనదేశానికే కాదు, లోకానికే ఉపకారంగాకూడా పరిణమిస్తుంది.

శంకరభగవత్పాదుల శిష్యకోటిలో తోటకాచార్యులనే ఆయన ఒకరు ఉండేవారు. చూడడానికి కాస్త మందకొడిగా ఉండేవారు. చూచేవారికి పాఠాలు ఆయనకు ఎక్కుతున్నట్టు కనిపించేది కాదు. అందుచేత ఇతరశిష్యులకు ఈయన అంటే కొంచెం చిన్నచూపు. ఆచార్యులవారు దీనిని గమనించారు. శిష్యులలో ఈఅహంకారం వృద్ధిఐతే వారికే చెరుపుకదా అని అనుకొన్నారు. వీరికి ఈ అహంకారం కూడదనుకొన్నారు. వారు సంకల్పసిద్ధులుగదా! వారు ఈవిధంగా అనుకొనేసరికి తోటకాచార్యులవారికి ఎక్కడలేని కవిత్వం పుట్టుకొచ్చింది. ఆనందంతో నృత్యంచేస్తూ 'విదితాఖిలశాస్త్ర సుధాజలవిధే'యని తోటకవృత్తాలను ఎనిమిదిటిని అశువుగా చెప్పారు. దీనిని చూచిన ఆచార్యులవారి శిష్యులు నివ్వెరపడి అశ్రుపూరిత నేత్రాలతో తమ తప్పిదాన్ని తెలుసుకొని క్షమాభిక్ష వేడుకొన్నారు.

తోటకాచార్యులు వ్రాసిన ఈతోటకాష్టకంలో ఎన్నో గొప్ప వేదాంతసత్యాలుండటమేకాక, ఆచార్యులవారి అవతారోద్దేశమూ వివరించబడినది. సూర్యోదయముతో లోకమంతటా ఆవరించిన చీకట్లు ఏవిధంగా తొలగిపోతవో అదేవిధంగా జ్ఞానభాస్కరులవంటి ఆచార్యుల అవతరణతో అజ్ఞానతిమిరాలు విచ్చిపోయి అందరూ జ్ఞానసౌధం అధిరోహించి అంతిమ సత్యాన్ని కనుగొనడానికి అవకాశ మేర్పడింది.

వ్యావహారికమనీ, పారమార్ధికమనీ జ్ఞానం రెండు రకాలు. మన మనస్సులు ఎంతవరకు కామక్రోధాదులవశంలో ఉంటవో, అంతవరకు మనము పారమార్ధికజ్ఞానపాత్రులం కాలేదన్నమాట. సత్కర్మలూ, సత్సంగమూ మనకు నిత్యానిత్య వివేకాన్ని ఇస్తవి. ఆ సత్యజ్ఞానం మనము ఎపుడైతే ప్రదర్శించగల్గుతామో, అప్పుడు మనం ఆధిరోహించిన సోపానపంక్తి తిరోభూతమవుతుంది. అట్లుకాక పరిపక్వం కానివానికి సిద్ధము కానివానికి సత్యజ్ఞానము నివ్వబోతే, అది హానికే కారకమవుతుంది. పాములనుపట్టేవాళ్ళ ఇంటిలోని పిల్లవాడుకూడాపాము పుట్టలోనుంచి పాముతోకనుపట్టుకొనిసులభంగా, నిరపాయంగా కౌశలంగా లాగగల్గుతాడు. ఆ పని సులభంగా ఉందని మనము చేయబోతే పాముకాటు తప్పదు. అదేవిధంగా, అసిద్ధంగా ఉన్నవానికి, పరిపక్వం కానివానికి, మనం సత్యజ్ఞానాన్ని అందిస్తే దానివల్ల వాడు బాగుపడడానికి అవకాశం లేకపోవడమేకాక, చెడుపుకు దారితీస్తుంది. అందుచేతనే మన శాస్త్రాలు- 'ఇది రహ్యసం' అని చెప్పడం. గీతాశాస్త్రమూ అదేవిధంగా ''రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిదముత్తమమ్‌'' అని చెప్పుతున్నది.

అందుచేత పారమార్ధికజ్ఞానం మనకు కలుగవలెనంటే మొదట వ్యావహారికజ్ఞానాన్ని అభ్యసించి, మనోవికాసం పొందాలి. మన శాస్త్రాలలో, మన పుస్తకాలలో ఉన్న జ్ఞానసంపద యొక్క వైవిధ్యం నిజంగా అసమానమైనది. నవీనజ్ఞానం ఉదయించకముందే, మన ఖగోళశాస్త్రజ్ఞులు భూమి గుండ్రని ఆకారంతో ఉన్నదనీ, అది సూర్యునిచుట్టూ భ్రమిస్తున్నదనీ వ్రాసిఉన్నారు. మరొకతరగతివారు భూమికాదు భ్రమించడం, సూర్యుడే భూమిచుట్టూతిరుగుతున్నాడని వ్రాసినారు. న్యూటన్‌ భూమ్యాకరణసిద్ధాంతాన్ని చెప్పిఉన్నది. మనము చదువవలెనేకాని మనకున్న విజ్ఞానసంపద కొలదిఐనది కాదు.

మన మాతృభాషలలో పాండిత్యం సంపాదించడం మన ముఖ్యధర్మం. దానితోపాటు కొంత సంస్కృతభాషాపరిచయం మనలో ప్రతిఒక్కరికిన్నీ ఉండాలి. ఏడాది రెండేళ్ళలో ఎక్కువగా సంస్కృతవ్యాకరణం చదవలేకపోయినా, చిన్న ఉపన్యాసమూ, శ్లోకాని కర్థమూ తెలుసుకొనేంతటి సంస్కృతజ్ఞానం మనం అందరమూ కొంచెం శ్రమిస్తే పొందగలం. వీనికోసం 'స్టడీ సర్కిల్స్‌ ను' మనం ఏర్పరచుకోవాలి. ఇట్లు ప్రతిఒక్కరూ తమకు తీరిక అయిన కాలంలో సంస్కృత భాషాభ్యసనానికి ప్రారంభించి, సంస్కృతభాషలో కొంత వ్యావహారిక జ్ఞానం సంపాదించడం ఎంతైనా అవసరమని నాఅభిప్రాయం. అందువల్ల మహరులు బోధించిన గొప్పసత్యాలు మన సంస్కృతి సరిహద్దులలోనికి వచ్చి, మన వర్తనను చక్కజేసి సామాజిక క్షేమం ఆపాదింపగలుగుతవి.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page